మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప . దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నాడు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఫొటో లీక్ అయిన విషయం తెలిసిందే. శివుడి భక్తుడిగా ఈ ఫొటోలో ప్రభాస్ కనిపిస్తున్నాడు. అయితే ఈ ఫొటో లీక్ చేసిన వారిపై సీరియస్ అయ్యింది కన్నప్ప టీం. ఎవరు లీక్ చేశారో తెలుసుకునేందుకు పోలీస్ కేసు పెట్టబోతున్నట్లు ప్రెస్ నోట్‌ని విడుదల చేసింది.
కన్నప్ప టీమ్ నుంచి అత్యవసర, హృదయపూర్వక విజ్ఞప్తి. ప్రియమైన ప్రభాస్ అభిమానులు మరియు అందరి కథానాయకుల అభిమానులను కోరుతున్నది ఏమనగా…కన్నప్ప కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా మేము మా హృదయాలను, ప్రాణాలను అర్పించాము. రెండు సంవత్సరాల నిబద్ధతతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి మా టీమ్ నిరంతరం కృషి చేస్తోంది. ఇలాంటి క్షణంలో కన్నప్ప సినిమా నుంచి ఒక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇమేజ్ అనధికారంగా లీక్ అయినందుకు చాలా బాధ పడుతున్నాము, చింతిస్తున్నాము. ఈ లీక్ మా కష్టాన్ని మాత్రమే కాకుండా, ఈ ప్రాజెక్ట్‌లపై నిరంతరం కృషి చేస్తున్న 2,000 మందికి పైగా VFX కళాకారుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ లీక్ ఎలా జరిగింది అనేది కనుగొనేందుకు మేము పోలీస్ కేసు పెట్టడం జరుగుతోంది.
ఈ లీక్ అయిన ఇమేజ్ ఫుటేజ్‌ను ఎవరైనా షేర్ చేస్తూ ఉంటే, ఆ దొంగల్ని పట్టుకోమని అభిమానులందర్నీ మనస్ఫూర్తిగా కోరుతున్నాము. దీనిని షేర్ చేయడం ద్వారా, చట్టపరమైన చర్యలకు గురి కావాల్సి ఉంటుంది. ఈ లీక్ చేసిన వారిని ఎవరైనా కనుగొంటే, వారికి 5,00,000 రూపాయలు బహుమానంగా ఇస్తున్నాం. ఈ విషయం తెలుసుకున్న వెంటనే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ట్విట్టర్ అకౌంట్‌కి డైరెక్ట్ మెసేజ్ పంపండి అని ప్రార్ధిస్తున్నాము. ప్రేమ మరియు నిబద్ధతతో పుట్టిన ఈ ప్రాజెక్ట్ INTEGRITYని కాపాడటానికి మీ సహాయాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈ సినిమా స్ఫూర్తిని కాపాడటంలో మాతో చేతులు కలపండి. హృదయపూర్వక కృతజ్ఞతలతో, కన్నప్ప టీమ్ అంటూ పోస్ట్ చేసింది.