తొలి ఖోఖో ప్రపంచకప్‌లో భారత్ సత్తా చాటిన విషయం తెలిసిందే. దేశరాజధాని ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన ఈ వరల్డ్ కప్ మొదటి ఎడిషన్‌లో భారత పురుషుల, మహిళల జట్లు టైటిల్స్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాయి. అచ్చొచ్చిన స్వదేశీ క్రీడలో టోర్నీ ఆరంభం నుంచీ అసలు ఓటమన్నదే ఎరుగకుండా సత్తాచాటిన మన క్రీడాకారులు.. ఫైనల్‌లోనూ అదే ఆటతీరుతో తమకు ఎదురేలేదని నిరూపించారు. ఇరు విభాగాల్లోనూ నేపాల్ ప్రత్యర్థి కాగా రెండింట్లోనూ ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. అయితే భారత్‌ను విశ్వవిజేతగా నిలిపినందుకు పురుషుల, మహిళల జట్లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖులు రాజమౌళితో పాటు మహేశ్ బాబు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.భారతదేశపు ప్రాచీన క్రీడలలో ఒకటైన ఖో ఖో ప్రపంచ కప్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో భారత ఇరు జట్లు గెలుచుకోవడం సంతోషంగా ఉంది. అద్భుతమైన ప్రదర్శనలతో తొలి టైటిల్స్ గెలిచి దేశం గర్వించేలా చేసినందుకు భారత మహిళల, పురుషుల జట్లకు అభినందనలు అంటూ రాజమౌళి రాసుకోచ్చాడు.