చలి కాలంలో ఆవనూనె శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆవ నూనెలో విటమిన్ ఈ తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. అవి చర్మంలో తేమ నిల్వ ఉండటానికి తోడ్పడతాయి. అదే సమయంలో చర్మం మంచి నిగారింపు సంతరించుకునేందుకు వీలు కల్పిస్తాయి. ఆవ నూనెతో చర్మం పగుళ్లుబారకుండా ఉంటుంది. చర్మంపై దురద, ర్యాషెస్ వంటివి ఏర్పడకుండా చూస్తుంది. ఈ నూనెతో మర్ధన చేయడం వల్ల చర్మంపై మృత కణాలు తొలగిపోతాయి. చర్మం సున్నితంగా మారుతుంది. చర్మానికి సాగే గుణం పెరుగుతుంది. దీనివల్ల ముడతలు పడకుండా ఉంటుంది. ఇక ఈ నూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తాయి. వయసు మీదపడటం వల్ల ఏర్పడే లక్షణాలను నివారిస్తాయి.
ఆవ నూనెకు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అవి చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఆవ నూనెను రాసుకోవడం వల్ల చర్మం మాత్రమే కాదు… వెంట్రుకల కుదుళ్లు బలపడతాయని నిపుణులు చెబుతున్నారు. చుండ్రు నివారణలో, వెంట్రుకలు తెగిపోకుండా ఉండటానికి కూడా ఆవనూనె తోడ్పడుతుందని వివరిస్తున్నారు. చలి తీవ్రత కారణంగా కండరాలు బిగదీసుకుపోయినట్టు అవుతాయని… ఆవ నూనెతో చర్మంపై మర్ధన చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరిగి, వేడి నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనితో కండరాలకు ఉపశమనం లభిస్తుందని వివరిస్తున్నారు.