HomeEntertainmentమోహ‌న్ బాబు బ‌ర్త్ డే..స్పెష‌ల్

మోహ‌న్ బాబు బ‌ర్త్ డే..స్పెష‌ల్

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మోహన్ బాబు పుట్టిన‌రోజు. 1952 మార్చి 19న ఆయ‌న జన్మించారు. ఇవాళ్టితో ఆయన 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం మంచు వారి డ్రీమ్ ప్రాజెక్టు అయిన కన్నప్ప ప్రమోషన్స్ లో మోహన్ బాబు బిజీగా ఉన్నారు. ఆయన బ‌ర్త్‌డే సందర్భంగా కొన్ని విశేషాలు చూద్దాం… 1975 నుంచి 1990 వరకు మోహన్ బాబు భారతీయ సినిమాల్లో విలన్ పాత్రకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చారు. దేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న ప్రతినాయకులలో ఒకరిగా నిలిచిన ఆయన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. స్వర్గం నరకం చిత్రంతో పరిశ్రమకు హీరోగా పరిచయం అయినా.. విలన్ పాత్రలతో టాప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
1990వ దశాబ్దంలో మోహన్ బాబు హీరోగా మారి ప్రేక్షకులను తనదైన శైలితో అలరించారు. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఆయన స్థాయిని పెంచాయి. తెలుగు చిత్రాల్లో ఆయన నటించిన అనేక చిత్రాలు తరువాత హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అయ్యాయి. అక్కడ కూడా భారీ విజయాలు న‌మోదు చేశాయి.

తద్వారా ఆయన పేరు జాతీయ స్థాయిలో వినిపించింది.పెదరాయుడు విజయోత్సవాల్లో 200 రోజుల వేడుక తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ చారిత్రక వేడుకకు మొత్తం రాష్ట్ర కేబినెట్, ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. ఇది మోహన్ బాబు క్రేజ్‌కు నిదర్శనం. ఆయ‌న‌ ప్రభావం సినిమాలపై మాత్రమే కాకుండా రాజకీయ రంగానికి విస్తరించింది. 1993లో ఆయన నిర్మించిన మేజర్ చంద్రకాంత్ చిత్రం… ఎన్‌టీఆర్‌ తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్ర 100 రోజుల వేడుక తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సభ సినిమా, రాజకీయ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా నిలిచిపోయింది.సినిమా రంగంలో విశేష విజయాలను సాధించిన మోహన్ బాబు విద్యా రంగంలోనూ విశేషమైన సేవలను అందించారు. 1992లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా 25 శాతం మంది పేద విద్యార్థుల‌కు ఉచిత విద్యను అందిస్తూ వారి అభివృద్ధి అవకాశాలను సృష్టించారు. 2022లో ప్రారంభమైన మోహన్ బాబు విశ్వవిద్యాలయం విద్య పట్ల వారి అంకితభావానికి నిలువుటద్దంగా నిలిచింది. మోహన్ బాబు తన సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో గౌరవ పురస్కారాలను అందుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేయగా, 2016 ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆయన్ను వరించింది.విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలువ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read