తన కెరీర్‌లో చేయని ఓ కొత్త జానర్‌లో నాగచైతన్య ఓ చిత్రాన్ని అంగీకరించాడు. ఇంతకు ముందు సాయి దుర్గ తేజ్, సంయుక్త మీనన్‌లతో ‘విరూపాక్ష’ లాంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకుడు. ‘మిథికల్ థ్రిల్లర్’గా రూపొందనున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ, సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిపి నిర్మిస్తోంది. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రానికి సుకుమార్ కూడా మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. కాగా శనివారం కథానాయకుడు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ పోస్టర్‌లో ఓ పవర్‌ఫుల్ నేత్రంలో రాక్ క్లైంబింగ్ టూల్స్‌తో ఓ పర్వతంపై నిలబడి ఉన్న నాగ చైతన్య కనిపించారు. ఇది ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తుంది. నాగచైతన్య కెరీర్‌లో 24వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి ఎన్‌సీ 24 అనే వర్కింగ్ టైటిల్‌ను నిర్ణయించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకోనున్న ఈ చిత్రంలో సిజీ వర్క్ గ్రాండ్‌గా ఉండబోతుందని, ఇందుకోసం ఉన్నతమైన సాంకేతిక నిపుణులను ఉపయోగిస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు. విజువల్‌గా ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుందని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. శ్యామ్ దత్ ఫోటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష చిత్రాలతో అందరి మెప్పు పొందిన అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీ నాగేంద్ర కళా దర్శకుడు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారు.