మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకోగా ఆయన బాటలో నడుచుకుంటూ వచ్చిన మెగా హీరోలు ఇప్పుడు మంచి పొజీషన్‌లో ఉన్నారు. చిరంజీవి తర్వాత ఆ స్థాయికి ఎదిగిన హీరో అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. సినిమాలతో సంబంధం లేకుండా ఆయనకి రెండు తెలుగు రాష్ట్రాలలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి చిన్న తమ్ముడిగా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవన్ ఎన్నికల్లో గెలిచి తర్వాత అన్నా వదినల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో సురేఖ తన మరిదికి కాస్ట్లీ పెన్ ని కానుకగా అందించారు.
చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కూడా డైరెక్ట్‌గా చిరంజీవి ఇంటికి వచ్చి అన్న వదినల ఆశీర్వాదం తీసుకున్నారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన కొణిదెల నాగబాబు గత మార్చి నెలలో జరిగిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో, కూటమిలో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం శాసన మండలి చైర్మన్ సమక్షంలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. శాసన మండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నాగబాబు.. తన అన్నా వదినల ఆశీర్వాదం తీసుకున్నారు. నాగబాబుని చిరంజీవి, సురేఖ దంపతులు పూల మాలతో సత్కరించారు. తమ్ముడిని సత్కరించిన ఫొటోలని చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడి గా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో అన్నయ్య, వదిన అని రాసుకొచ్చారు. అన్నా తమ్ముళ్ల బంధాన్ని చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక నాగబాబుకి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, నాగబాబు.. తన సతీమణితో కలిసి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా కలిసారు.