నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తన అన్నయ్య బాలకృష్ణ గౌరవార్థం సొంత ఫాంహౌస్ లో నారా భువనేశ్వరి గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కుటుంబ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరైన ఈ ఫ్యామిలీ పార్టీ ఆద్యంతం ఉల్లాసంగా సాగింది..ముఖ్యంగా, చంద్రబాబు తన చమత్కారాలతో అందరినీ నవ్వించారు. నారా భువనేశ్వరి కూడా చంద్రబాబుతో కొన్ని సరదా వ్యాఖ్యలు చేయడం ఈ కార్యక్రమంలో నవ్వులు పూయించింది. నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబుకు వేదికపై మైక్ అందిస్తూ… ఏమండీ ఒకసారి ఇలా రండి… బాలా గురించి కొన్ని మాటాలు మాట్లాడండి… అయితే ఐదు నిమిషాల్లో స్పీచ్ అయిపోవాలి… ఇదేమీ రాజకీయ ప్రసంగం కాదు… గంటలు గంటలు మాట్లాడొద్దు అని అన్నారు. తన అర్ధాంగి మాటలకు నవ్వుతూనే మైక్ అందుకున్న చంద్రబాబు… అన్నాచెల్లెళ్లను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“ఇది నిజంగా అద్భుతమైన సాయంత్రం. ఒకవైపున బాలయ్య… మరోవైపు అంతే పవర్ ఫుల్ అయిన భువు (భువనేశ్వరి)… ఇద్దరి మధ్యన నేను నలిగిపోతున్నా… వీళ్లిద్దరి మధ్యన ఉంటే చాలా ప్రమాదం! ఈ ఫ్యామిలీ పార్టీ గురించి కూడా నాకేమీ తెలియదు…. ‘నేనేం చేస్తానో మీకు ఎవరికీ చెప్పను… నా అన్నయ్యకి నేను చేయబోయే కార్యక్రమం నా అభిమానంతో చేస్తున్నాను… ఇందులో మీకెవరికీ ప్రమేయం లేదు… ఇది నా అభిమతం’ అని చెప్పి భువనేశ్వరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది” అని చంద్రబాబు వివరించారు. తన బావమరిది బాలకృష్ణను చంద్రబాబు ఈ సందర్భంగా పొగడ్తల్లో ముంచెత్తారు. “నిన్నటిదాకా అల్లరి బాలయ్య… ఇప్పుడు పద్మభూషణుడు… ఎన్టీఆర్ ను గుర్తుపెట్టుకునేలా బాలయ్య నడుచుకుంటున్నారు… అందుకు నేను గర్విస్తున్నాను. బాలయ్య అన్ స్టాపబుల్ కెరీర్ లో ఇదొక మైలురాయి. ఆయనకు పద్మభూషణ్ రావడం మా కుటుంబానికి గర్వకారణం. మా కుటుంబంలో ఇంతపెద్ద అవార్డు రావడం ఇదే ప్రథమం. మా కుటుంబం అంతా ఎంతో ఆనందిస్తోంది.
కెరీర్ పరంగా చూస్తే బాలయ్య నాకంటే సీనియర్. ఆయన 1974లో తొలి సినిమా చేస్తే, నేను 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యాను. బాలకృష్ణ పైకి అల్లరిగా కనిపించినా, లోపల డెప్త్ ఉంది, ఒక డెడికేషన్ ఉంది. గొప్ప మానవతా దృక్పథం ఉన్న వ్యక్తి. క్యాన్సర్ ఆసుపత్రిని అద్భుతంగా తీర్చిదిద్దారు. బాలయ్య టేకోవర్ చేసిన తర్వాత క్యాన్సర్ ఆసుపత్రి దేశంలోనే అగ్రగామి ఆసుపత్రుల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. అందుకు నేనెంతో గర్విస్తున్నాను. ముచ్చటగా మూడు సార్లు హిందూపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య… అప్పుడప్పుడు ఆయన అర్ధాంగి వసుంధరకు టికెట్ ఇవ్వమని అడుగుతుంటాడు. మరి కావాలనే ఆ విధంగా అడుగుతాడో, లేక ఆమెను మెప్పించడానికి అడుగుతాడో అర్థం కాదు” అంటూ చంద్రబాబు నవ్వులు పూయించారు.