అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ విడతగా విమానంలో కొందరు భారతీయుల్ని స్వదేశానికి తిప్పి పంపారు. దాంతో అమెరికా మన పౌరుల్ని బలవంతంగా భారత్‌కు పంపిస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. కానీ అమెరికా పర్యటనలో మోదీ సంచలన ప్రకటన చేశారు. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న దేశ పౌరులను భారత్‌కు తిరిగి తీసుకొస్తామని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఓ దేశంలో చట్ట విరుద్ధంగా ప్రవేశించిన వారికి, అక్కడ నివసించే హక్కు ఉండదన్నారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. అక్రమ వలసల్ని ఏ దేశం సహించదని, ప్రపంచమంతా ఇది వర్తిస్తుందన్నారు. అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని భావించిన వారికి ప్రధాని మోదీ బిగ్ షాకిచ్చారు. మరోవైపు అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, చదువుపూర్తయిన వారు రెస్టారెంట్లలో, బార్లలో, పెట్రోల్ బంకుల్లో కనుక కనిపిస్తే వారి వివరాలు ఆరా తీస్తుండటంతో భయాందోళన నెలకొంది. ఇటీవల పంజాబ్ యువకుడు డంకీ మార్గంలో అమెరికాకు వెళ్తూ మార్గం మధ్యలో చనిపోవడం కలకలం రేపింది.