చిరుత’ చిత్రంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన తెలుగు తెరకు పరిచయమైన నటి నేహా శర్మ, బాలీవుడ్ లో ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, కెమెరా వెనుకకు వెళ్లి దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారన్న వార్త బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం, నేహా శర్మ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ నిర్మించనున్నారని తెలుస్తోంది. 1945 నాటి కాలం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో యువ నటులు సిద్ధాంత్ చతుర్వేది, మోహిత్ కీలక పాత్రలు పోషించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.తెలుగులో ‘చిరుత’ సినిమాతో అరంగేట్రం చేసిన నేహా శర్మ, ఆ తర్వాత వరుణ్ సందేశ్‌తో కలిసి ‘కుర్రాడు’ చిత్రంలో నటించారు. అనంతరం బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. హిందీతో పాటు తమిళం, మలయాళం, పంజాబీ భాషల్లోనూ చిత్రాలు చేసి నటిగా మెప్పించారు. ఇప్పుడు నటన నుంచి దర్శకత్వం వైపు అడుగులు వేస్తుండటంతో ఆమె కెరీర్‌లో ఇది ఒక కీలక మలుపు అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.