HomePoliticalవ‌చ్చే నెల నుంచి.. కొత్త రేష‌న్ కార్డులు

వ‌చ్చే నెల నుంచి.. కొత్త రేష‌న్ కార్డులు

రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల నుంచి కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. ఈ రేషన్ కార్డులు ఆధునిక టెక్నాలజీతో క్యూ ఆర్ కోడ్ లను కలిగి ఉంటాయని తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగం సమీపంలోని రైసుమిల్లును, జెండాదిబ్బ వద్దనున్న బహుళ ప్రయోజన సౌకర్య గోదాము (స్టాక్‌ పాయింట్‌)ను మంత్రి తనిఖీ చేశారు. రైసుమిల్లును తనిఖీ చేసి ధాన్యం సేకరణకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెండా దిబ్బ వద్ద స్టాక్ పాయింట్‌ను తనిఖీ చేసి స్టాకు వివరాలు, సరఫరా మొదలైన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్‌ మహిళలనుద్దేశించి మాట్లాడారు.

ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమన్నారు. మహిళలందరూ కూడా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల నుంచి కొత్త రేషన్‌ కార్డులను అందిస్తామని చెప్పారు. రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దీపం-2 పథకం హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారని, ఇందులో భాగంగా ఈ జిల్లాలో 4 లక్షల మందికి ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 93.42 లక్షల మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని, ఈ ఏడాది 1.50 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారం మహిళలందరూ తెలుసుకోవాలని, భాగస్వామ్యం కావాలని సూచించారు. మే నెల నుంచి అన్ని సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కోసం మంచి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img