అవకాశం వస్తే తప్పకుండా పవన్ కల్యాణ్ కుమారుడు అకీరాతో సినిమా చేస్తానని కోలీవుడ్ డైరెక్టర్ విష్ణువర్థన్ అన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా ‘పంజా’ చిత్రాన్ని తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు విష్ణువర్ధన్. ఆయన తాజా చిత్రం ‘ప్రేమిస్తావా’ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అకీరాతో దర్శకుడు విష్ణు సినిమా తెరకెక్కించనున్నారని ఇటీవల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, అకీరాతో ‘పంజా’ సీక్వెల్’ని కానీ, వేరే సినిమాగానీ తీస్తున్నారా? అని మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన స్పందిస్తూ, తానేదీ ముందుగా ప్రణాళిక చేయనని, దేనికైనా సమయం రావాలని, ‘పంజా’ కూడా ప్రణాళిక చేసి తీసింది కాదని పేర్కొన్నారు. పంజా’ తర్వాత తెలుగులో మళ్లీ సినిమాలు చేయకపోవడంపై మాట్లాడుతూ.. తెలుగులో ప్రతిపాదనలు వచ్చిన సమయంలో వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందుకే ఇక్కడ సినిమాలు చేయలేకపోయానని వివరణ ఇచ్చారు. ఒకవేళ తాను మరో తెలుగు సినిమా చేయకపోతే తన తల్లి ఊరుకోరని అన్నారు.