HomePoliticalపిచ్చా అన్నా..అసెంబ్లీపై అలుగుతావ‌

పిచ్చా అన్నా..అసెంబ్లీపై అలుగుతావ‌

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, వైసీపీ అధినేత జగన్ సభకు గైర్హాజరయ్యారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ తీరు చూస్తుంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుందని ఘాటుగా విమర్శించారు. జనం మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడానికా? అంటూ మండిపడ్డారు.

ప్రజలు మీకు ఓట్లేసింది… అసెంబ్లీ మీద అలగడానికో, మైకు ఇస్తేనే సభకు పోతాననినని మారాం చేయడానికో కాదు! మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది… ఇంట్లో కూర్చుని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు! మీ స్వయంకృతాపరాధమే మిమ్మల్ని ప్రతిపక్షానికి దూరం చేసింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతాననడం మీ అవివేకానికి, మీ అజ్ఞానానికి నిదర్శనం” అంటూ జగన్ ను దుయ్యబట్టారు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం అని, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశం అని షర్మిల వివరించారు.

కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కు లేదు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అమలు కావడంలేదు. రాష్ట్రంలో మహిళలపై దాడులు ఆగడంలేదు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. బెల్టు షాపుల దందా అరికట్టడంలేదు. ఐదు నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదు. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసే అవకాశాన్ని ప్రజలు వైసీపీకి ఇస్తే , ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామనడం సిగ్గుచేటు. 1994లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లే వచ్చాయి. అయినప్పటికీ విపక్ష హోదా కావాలని మారాం చేయలేదు. ఆ 26 మంది సభ్యులతోనే అసెంబ్లీలో ప్రజాపక్షంగా కాంగ్రెస్ నిలిచింది. అనేక సమస్యలపై నాడు టీడీపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపించింది.

కేంద్రంలో… 2014లో 44 సీట్లు… 2019లో 52 సీట్లే వచ్చినా కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా అడగలేదు. హోదా లేకపోయినా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రజల పక్షాన పోరాడారు. మోదీ నియంతృత్వాన్ని ప్రశ్నిస్తూ, దేశ ప్రజల గొంతుకలా కాంగ్రెస్ మారింది. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కనబెట్టి అసెంబ్లీకి వెళ్లి, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి. ఒకవేళ అసెంబ్లీకి వెళ్లే దమ్ము, ధైర్యం మీకు లేకపోతే వైసీపీ శాసనసభాపక్షం మొత్త రాజీనామా చేయండి. అప్పుడు ఇంట్లోనే కాదు… ఎక్కడైనా కూర్చుని తీరిగ్గా మాట్లాడుకోండి” అంటూ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img