ఇటీవల యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో బోటులు నడిపే ఓ ఫ్యామిలీ ఏకంగా రూ. 30 కోట్లు సంపాదించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో వెల్లడించారు. దీంతో ఈ వార్త నెట్టింట బాగా హల్‌చల్ చేసింది కూడా. అరైల్ గ్రామానికి చెందిన బోట్‌మ్యాన్ పింటూ మహ్రా ఫ్యామిలీ ఇలా కుంభమేళా సమయంలో త్రివేణి సంగమం వద్ద 45 రోజుల పాటు సుమారు 130 బోట్లు నడిపింది. దాంతో నెలన్నరల్లోనే రూ. 30 కోట్లు సంపాదించింది. ఇదే విషయాన్ని సీఎం యోగి అసెంబ్లీలో ప్రస్తావించారు.
అయితే, పింటూ మహ్రా ఫ్యామిలీకి తాజాగా ఆదాయపన్ను శాఖ తాజాగా ఊహించని షాకిచ్చింది. ఇన్‌కం ట్యాక్స్ చట్టం 1961 ప్రకారం రూ.12.8 కోట్లు పన్నుగా చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ ఫ్యామిలీ ఇప్పుడు తలపట్టుకుంది. ఇక పింటూ ఫ్యామిలీకి ఆదాయపన్ను శాఖ నోటీసులపై సెబీ రీసర్చ్ అనలిస్ట్ ఏకే మంధన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. బోట్‌మ్యాన్ పింటూ డబ్బు సంపాదించినా.. ఆయనకు ఆనందం లేకుండా పోయిందని తెలిపారు. కుంభమేళాలో రద్దీ కారణంగా అతనికి బాగా గిట్టుబాటు అయిందని, ఒక్కొక్క రైడ్‌పై రూ. 1000 వచ్చాయన్నారు.
అంతకుముందు ఒక్కొ రైడ్‌కు రూ. 500 మాత్రమే వచ్చేవని, అది కూడా రోజుకు ఒకటి రెండు రైడ్లు మాత్రమే దక్కేవని పేర్కొన్నారు. కానీ కుంభమేళా పుణ్యమా అని పింటూ బాగా ఆర్జించారని తెలిపారు. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ కుటుంబానికి షాక్ ఇచ్చినట్లు తన పోస్టులో పేర్కొన్నారు.ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ 1961 ఐటీచట్టంలోని సెక్షన్స్ 4, 68 కింద నోటీసు ఇచ్చిందని మంధన్ చెప్పారు. ట్యాక్స్ శ్లాబ్‌లు తెలియని వ్యక్తి .. ఇప్పుడు భారీ ట్యాక్స్ కట్టాల్సి వస్తోందన్నారు. బాగా డబ్బు సంపాదించినా.. అదో పీడకలగా మారిందన్నారు. ఒకప్పుడు పింటూ ఫ్యామిలీ నెలలో రూ. 15వేలు సంపాదించేందుకు బాగా కష్టపడేవాళ్లని, అలాంటిది ఇప్పుడు ఒకే ఏడాదిలో రూ. 12.8 కోట్ల పన్ను కట్టాల్సి వస్తుందని తెలిపారు.