భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో అమెరికాలో పర్యటిస్తారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ కు అభినందనలు తెలిపేందుకు మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ట్రంప్, మోదీల మధ్య సుదీర్ఘ సంభాషణ జరిగింది. మోదీతో ఏం మాట్లాడారని అమెరికా మీడియా ప్రశ్నించగా ట్రంప్ స్పందిస్తూ.. మోదీ తనకు చిరకాల మిత్రుడని, ఇండియా అమెరికాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మోదీని వైట్ హౌస్ కు ఆహ్వానించానని, బహుశా వచ్చే నెలలో ఆయన అమెరికా వస్తారని ట్రంప్ వివరించారు.మోదీ, ట్రంప్ మంచి స్నేహితులు. ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో చివరి విదేశీ పర్యటనను భారత్ లోనే చేయడం విశేషం. 2020 ఫిబ్రవరిలో ట్రంప్ అహ్మదాబాద్ లో పర్యటించారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఈ నెల 21న ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన విదేశీ అధినేతలు ట్రంప్ కు ఫోన్ లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.