దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో సోమవారం ఉదయం బలమైన భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో భయాందోళనలకు లోనైన జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే, ఆస్తి, ప్రాణనష్టమేమీ సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ భూకంపంపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. భయాందోళనలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.భూకంపం కారణంగా సంభవించిన బలమైన ప్రకంపనల తో ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ లలో అనేక ఎత్తైన భవనాల నివాసితులు బయటకు పరుగులు తీశారు. కాగా, ఢిల్లీలో భూకంపం వచ్చినప్పుడు పెద్ద శబ్దం వినిపించిందని అధికారి ఒకరు తెలిపారు.అటు ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిశీ కూడా ఈ భూకంపంపై స్పందించారు. ఢిల్లీలో ఇప్పుడే బలమైన భూకంపం సంభవించింది. అందరూ సురక్షితంగా ఉండాలి” అని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.