హీరో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్ . సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించింది. గతేడాది డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రభాస్ బాహుబలి 2 పేరు మీద ఉన్న అత్యధిక వసుళ్ల రికార్డును అధిగమించింది. అయితే ఈ సినిమా చివరిలో పార్ట్ 3 ఉండబోతుందంటూ చిత్రబృందం హింట్ ఇచ్చి వదిలేసింది. పుష్ప 3 ది ర్యాంపేజ్ అంటూ 3వ భాగం రాబోతుండగా.. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా అనే డౌట్ అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్‌కు కూడా కలిగింది. అయితే 3వ భాగం ఉందని తాజాగా తెలిపాడు ఈ చిత్ర నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్. ఆయన నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా.. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకుంది. అనంతరం చిత్రనిర్మాత ప్రెస్‌మీట్‌తో మాట్లాడుతూ.. రిపోర్టర్స్ పుష్ప 3 ప్రస్తావన తీసుకురాగా.. పుష్ప 3పై రవిశంకర్ స్పందిస్తూ.. పుష్ప 3 ర్యాంపేజ్ ఉందని.. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించి.. 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు రవిశంకర్ వెల్లడించాడు.