రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ టీజర్ క్రేజ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వినూత్నంగా ఉపయోగించుకున్నారు.ఈనెల 16న ‘రాజాసాబ్’ టీజర్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. తెలుగు టీజర్‌లోని ‘బండి కొంచెం మెల్లగా’, ‘అసలే మన లైఫ్ అంతంతమాత్రం’ వంటి డైలాగులు సోషల్ మీడియాలో పాప్యులర్ అయ్యాయి. ఈ పాప్యులారిటీని సద్వినియోగం చేసుకుంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిన్న ఒక ప్రత్యేక అవగాహన వీడియోను రూపొందించి విడుదల చేశారు.ఈ వీడియోలో ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడానికి ప్రభాస్ డైలాగులను చాలా తెలివిగా ఉపయోగించారు. ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రంలోని “ఇట్స్ షో టైమ్” అనే డైలాగుతో వీడియో మొదలవుతుంది. ఆ వెంటనే, మితిమీరిన వేగంతో వెళ్తున్న ఒక బైక్ దృశ్యం కనిపిస్తుంది. అప్పుడు ‘రాజాసాబ్’ టీజర్‌లోని “హలో హలో బండి కొంచెం మెల్లగా” అనే డైలాగ్ వినిపిస్తుంది.
దీనికి కొనసాగింపుగా, ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ నెమ్మదిగా బైక్‌పై వెళ్తున్న సన్నివేశాన్ని జోడించారు. ఆ తర్వాత ‘రాజాసాబ్’లోని “అసలే మన లైఫ్ అంతంతమాత్రం” అనే డైలాగ్ ప్లే అవుతుంది. చివరగా ‘మిర్చి’ సినిమాలోని ప్రభాస్ హెల్మెట్ తీస్తున్న సన్నివేశాన్ని చూపిస్తూ, “హెల్మెట్ ధరించండి, నెమ్మదిగా వెళ్లండి” అనే స్పష్టమైన సందేశాన్ని ప్రజలకు అందించారు.హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనికి “#HYDTPweBringAwareness” అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు “హలో… హలో….! బండి కొంచెం మెల్లగా డ్రైవ్ చేయండి డార్లింగ్” అని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.