అమరావతికి రైల్వే లైన్ మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు గురువారం న్యూఢిల్లీలో స్పందించారు. ఇది చారిత్రాత్మకమైన రోజు అని ఆయన అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కల నిజమవుతున్న రోజు.. ఈ రోజు అని అన్నారు. రాష్ట్ర ప్రజలు ముగ్గురిపై నమ్మకం పెట్టుకున్నారన్నారు. వారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఆయన వివరించారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ గురువారం క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కనెక్టివిటీ అత్యంత కీలకమైన అంశమని ఆయన గుర్తు చేశారు. అమరావతికి రైల్వే లైన్ మంజూరు చేయడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణ, రవాణా సదుపాయాల మరింత పెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను కేవలం 10 రోజుల్లోనే క్యాబినెట్ ముందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తీసుకు వచ్చారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గత ఐదేళ్లలో రాష్ట్రం ఎదుర్కొన్న సంక్షోభానికి ఈ తరహా వేగవంతమైన నిర్ణయాలు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్ణీత సమయంలోగా పూర్తవుతుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 15 వేల కోట్లు కేటాయించారని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. ఇక ఎన్నికల ప్రచారంలో సైతం ఆంధ్రప్రదేశ్‌తోపాటు రాజధాని అమరావతి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. దీంతో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమికి ప్రజలు మద్దతు పలికారు..ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం..కేంద్ర బడ్జెట్‌లో సైతం ఏపీకి బడ్జెట్ కేటాయింపుల్లో అధిక నిధులు వెచ్చించింది. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరపకుండా గతంలో వలే.. ఆ సంస్థ పని చేసుకునే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ఓ చర్చ సైతం సాగుతుంది. ఇక విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు చర్యలు సైతం వేగవంతమైనాయి.
ఏపీ ప్రజలకు కేంద్రప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,245 కోట్లతో రాజధాని అమరావతికి నూతన రైల్వే లైన్ మంజూరు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 57 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసినట్లు తెలిపారు. హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. ఇందులో భాగంగానే కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణం చేపడతామన్నారు. ఈ రైల్వే లైన్ కృష్ణపట్నం, మచిలీపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ ఏర్పాటు కానుంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే దక్షిణ, మధ్య, ఉత్తర భారత్‌తో అనుసంధానం మరింత సులభం కానుంది. అమరావతి స్థూపం, ధ్యాన బుద్ధ ప్రాజెక్టు, ఉండవల్లి గుహలు, అమర లింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేవారికి అనువైన మార్గంగా మారనుంది..రైల్వే లైన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధికి రూ.252.42 కోట్లను కేంద్రప్రభుత్వం మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నిధులిచ్చింది. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ‘ఎక్స్’ వేదికగా వివరాలు వెల్లడించారు.