HomeDevotionalమేడారం మ‌హాజాత‌ర‌కి..రూ.150కోట్లు

మేడారం మ‌హాజాత‌ర‌కి..రూ.150కోట్లు

తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ మహా జాతర..ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. “దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతర”గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది.మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 1996 లో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది.ఈ జాత‌ర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది.

జాతరకు ఐదు నెలల ముందే భారీగా నిధులు విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2026లో జరగనున్న మేడారం జాతర ఏర్పాట్ల కోసం రూ. 150 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఈ మహా జాతర జరగనుంది. ఈ జాతరకు సుమారు కోటిన్నర మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించింది. గతంలో 2024 జాతర కోసం కేటాయించిన నిధుల కంటే ఈసారి అదనంగా రూ. 45 కోట్లు పెంచడం విశేషం. అంతేకాకుండా, సాధారణంగా జాతరకు కొన్ని రోజుల ముందు నిధులు విడుదల చేసే పద్ధతికి భిన్నంగా, ఈసారి ఐదు నెలల ముందుగానే నిధులను విడుదల చేయడంపై భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముందస్తు చర్యల వల్ల అభివృద్ధి పనులు నాణ్యతతో, సకాలంలో పూర్తవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.నిధుల విడుదలపై మంత్రి సీతక్క స్పందిస్తూ జాతరకు భారీగా నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జాతర ప్రాముఖ్యతకు, భక్తుల మనోభావాలకు ఇస్తున్న గౌరవానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read