తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం..రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూ వివాదంలో గిరిజనుల ఆందోళనకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు భూసేకరణ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫార్మా విలేజ్ కోసం దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
భూ సేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం ఉపసంహరించుకున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాలలో ప్రజల అభిప్రాయ సేకరణ తర్వాత భూసేకరణ రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు. ఆయా గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రేవంత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటును స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న వికారాబాద్ జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులు ప్రజల అభిప్రాయ సేకరణ కోసం గ్రామానికి చేరుకోగా వారిపై స్థానిక రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వెంకట్ రెడ్డి అనే ప్రత్యేక అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా, కలెక్టర్ సహా ఇతర అధికారుల వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఘటనపై రేవంత్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయగా.. మెుత్తం19 మంది రైతులను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు..
