తిరుమల : తిరుమల మొదటి ఘాట్‌రోడ్డు అక్కగార్ల ఆలయంలో 13వ తేదీ ఉదయం టిటిడి రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏడుగురు అక్కా దేవతలకు కార్తీక మాస పూజలు నిర్వహించారు. అక్కగార్లకు కార్తీక మాస పూజ నిర్వహించడం ఏటా ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ డ్రైవర్లు, స్థానికులు సంయుక్తంగా పూజలు నిర్వహించారు.
అక్కగార్ల ఆలయ నిర్మాణం వెనుక చరిత్ర
అక్కగార్ల ఆలయ నిర్మాణానికి ఒక ముఖ్యమైన చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1940లలో, మొదటి ఘాట్ రోడ్డు నిర్మాణ సమయంలో, ప్రస్తుత ప్రాంతంలో అక్కగార్ల రాళ్లు ఉన్నాయని నివేదించబడింది. ఆ సమయంలో, నిర్మాణాన్ని ప్రారంభించడానికి ఈ రాళ్లను తొలగించారు. దీంతో రోడ్డు నిర్మాణానికి ఆదిలోనే అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రమాదాలు సంభవించాయి. ఈ సమయంలో అక్కగార్ల రాతి స్తంభాల ప్రాముఖ్యత గురించి స్థానికులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారులు సత్వరమే రోడ్డు పక్కన పెద్ద రాతి కింద ఏడు అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ కర్మ పూర్తయిన తర్వాత, మొదటి ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు సజావుగా పూర్తయ్యాయి. 2008 నుంచి అక్కగార్ల ఆలయంలో కార్తీక మాసంలో ఒకరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రారంభించారు. అప్పటి నుంచి మొదటి ఘాట్ రోడ్డులోని అవ్వాచారి కోన సమీపంలో ఉన్న అక్కగార్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.