12 ఏళ్ల తర్వాత టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. నిన్న దుబాయ్ లో జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించి, ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయం యావత్ భారతీయులను సంతోషసాగరంలో ముంచెత్తింది. సునీల్ గవాస్కర్ వంటి క్రికెట్ దిగ్గజం సైతం ఆనందంతో నృత్యం చేశారు. 75 ఏళ్ల వయసులో మైదానంలో ఆయన పట్టలేనంత ఉత్సాహంతో డ్యాన్స్ చేసి… టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. నిన్న గెలిచిన జట్టులో తాను కూడా ఒక సభ్యుడ్నే అన్నంత జోష్ గవాస్కర్ ప్రతి చర్యలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.