భారత అమ్మాయిల జట్టు ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ గెలవడం తెలిసిందే. ఈ విజయం పట్ల యావత్ భారతదేశం సంతోషంతో పొంగిపోతోంది. 2023లో ఈ టోర్నీ తొలిసారిగా నిర్వహించగా, టైటిల్ గెలిచిన భారత్… 2025లోనూ టోర్నీలో విజేతగా నిలిచింది. మలేషియాలో జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగిన టీమిండియా మహిళల జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ నిలబెట్టుకుంది. ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మన నారీ శక్తి పట్ల అమితంగా గర్విస్తున్నానంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్-2025లో విజేతలుగా నిలిచినందుకు భారత జట్టుకు అభినందనలు. అద్భుతమైన సమష్టి కృషి, మన పట్టుదల, దృఢ సంకల్పం ఫలితమే ఈ విజయం. ఔత్సాహిక క్రీడాకారులకు ఈ గెలుపు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. టీమిండియా అమ్మాయిల జట్టు భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ మోదీ ట్వీట్ చేశారు.