జల సంరక్షణ చర్యలు చేపట్టండి
భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించండి
కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం.
2027 జూన్ కల్లా పోలవరం పూర్తి చేస్తాం
జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్వి జి. సాయిప్రసాద్
అమరావతి :- జిల్లాల్లో జల వనరుల సంరక్షణ చర్యలకు అధిక ప్రాధాన్యమిచ్చి పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో జలవనరుల విభాగం ఇచ్చిన ప్రజెంటేషన్ పై ఆయన స్పందిస్తూ జలవనరులను సమర్థవంతంగా నిర్వహించడం చాలా ముఖ్యమన్నారు. దురదృష్టవశాత్తు గత ఐదేళ్లు డ్యామ్ లు, కాలువ నిర్వహణ, గేట్టు మరమ్మత్తులు పూర్తిగా వదిలేశారని, ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే తిరిగి అమర్చేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకురాని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అయితే ఈ సారి మనం సమర్థవంతంగా జలవనరులను ఉపయోగించుకున్నామన్నారు. నీరు వృధా కాకుండా దాదాపుగా అన్ని రిజర్వాయర్లను నీళ్లతో నింపుకోగలిగామన్నారు. కాలువల మరమ్మతులు పర్యవేక్షించాలన్నారు. వచ్చే రెండు సీజన్లలో కనీసం 8 మీటర్లలో భూగర్భ జలాలుండేలా చూసుకోవాలన్నారు. నదుల అనునసంధానం క్లిష్టమైన లక్ష్యమని, దానికి రూ.లక్ష కోట్లు అవుతుందని, అయితే కేంద్రం సహకారంతో ఎలా ముందుకెళ్లాలనేది ఆలోచిస్తామన్నారు. కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేస్తే రాయలసీమ సస్యశామలవుతుందన్నారు.
2027 జులైకి పోలవరం పూర్తి చేస్తాం
పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నామని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తెలిపారు. ఈసారి వరుణుడు కరుణించాడని, అన్ని జలాశయాలు నింపుకోగలిగామన్నారు. అయితే క్లౌడ్ బరస్ట్ లు ఎక్కువగా సంభవిస్తున్నాయన్నారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ లు జరగడం వల్ల జిల్లాలో అనూహ్యంగా వర్షాలు కురిశాయన్నారు. బుడమేరు ఎగువ ప్రాంతంలో కూడా అనూహ్యంగా ఇలా జరగడం వల్లే వరదలు సంభవించాయన్నారు. భవిష్యత్తులో ఈ క్లౌడ్ బరస్ట్ లు ఎక్కువ జరిగే అవకాశాలున్నాయని, వాటిని ఎలా ఎదుర్కోవాలనేదానిపైన పనిచేస్తున్నామన్నారు. జిల్లాల్లో కలెక్టర్లంతా నరేగా పనుల్లో చెక్ డ్యామ్ ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జిల్లాల్లో అధనంగా నీరు నిల్వ చేయడానికి అవకాశమున్న కొత్త ప్రాంతాలను అన్వేషించాలన్నారు. పులిచింతల డ్యామ్ నిండుగా ఉందని, ఈ డ్యామ్ నుంచి వచ్చే జూన్ ఖరీఫ్ సీజన్ కు నీళ్లు విడుదల చేస్తామన్నారు. వర్షాలు బాగా కురవడం వల్ల రాష్ట్రంలో భూగర్బ జల మట్టం కూడా పెరిగిందన్నారు.