బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాది టెస్టుల్లో 50 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఆసీస్ ఇన్నింగ్స్ లో భాగంగా ఓసెనర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేయడం ద్వారా 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 11 టెస్టులు ఆడిన బుమ్రా 50 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన మూడో భారత పేస్ బౌలర్‌గా అతడు రికార్డుకెక్కాడు. బుమ్రా కంటే ముందు మాజీ పేసర్లు కపిల్ దేవ్, జహీర్ ఖాన్ ఈ ఘనత అందుకున్నారు. 1979లో కపిల్ 17 మ్యాచులు ఆడి 74 వికెట్లు తీశాడు. అలాగే 1983లో 18 టెస్టుల్లో 75 వికెట్లు పడగొట్టాడు. ఇక జహీర్ 2002లో 15 మ్యాచుల్లో 51 వికెట్లు తీశాడు. హిమ్మత్‌లాల్ మన్కడ్, బీఎస్ చంద్రశేఖర్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 50 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. వీరందరూ స్పిన్ బౌలర్లు.