తెలుగు సినిమా ఖ్యాతిని దాదాపు 45 సంవత్సరాల క్రితమే ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్. ఈ పేరు వింటేనే ఎవరికైనా గౌరవ భావం అనాలోచితంగా వచ్చేస్తుంది.మరుగున పడిపోతున్న సంప్రదాయ సంగీత, నృత్య కళలకు జీవం పోసి తన చిత్రాల ద్వారా ఎందరిలోనో ఆ కళలను నేర్చుకోవాలనే తపనను పెంపొందించిన కళాతపస్వి. తెలుగు చలన చిత్ర సీమకు వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి గొప్ప రచయితలను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1980లో విడుదలైన శంకరాభరణంతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విశ్వనాథ్.. 1965లోనే ఆత్మగౌరవం చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు.
ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అంతటి మహోన్నత దర్శకుడు నిమా రంగానికి ఎలా వచ్చారు, ఆయన సినీ ప్రయాణం ఎలా సాగింది, సంప్రదాయాలు, ఆచారాల గొప్పతనాన్ని చెబుతూ మూఢాచారాలను వ్యతిరేకించే సినిమాలను రూపొందించాలన్న ఆలోచన ఎలా వచ్చింది వంటి విషయాల గురించి కళాతపస్వి కె.విశ్వనాథ్ బయోగ్రఫీలో తెలుసుకుందాం. 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లాలో రేపల్లె తాలూకా పెద పులివర్రు గ్రామంలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు జన్మించారు కాశీనాథుని విశ్వనాథ్. ప్రాథమిక విద్య అదే గ్రామంలో చేసినా వారి కుటుంబం విజయవాడ చేరింది.విజయవాడలో హైస్కూల్ వరకు చదువుకొని హిందు కాలేజీలో ఇంటర్, ఎసి కాలేజీలో బి.ఎస్‌సి పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాస్‌లోని వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీరింగ్ విభాగంలో అప్రెంటిస్‌గా జాయిన్ అయ్యారు విశ్వనాథ్. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం కూడా అక్కడే పనిచేసేవారు. సౌండ్ ఇంజనీర్ ఎ.కృష్ణన్ ఆధ్వర్యంలో సౌండ్ ఇంజనీరింగ్‌లో మెళకువలు నేర్చుకొని అసిస్టెంట్‌గా ఎదిగారు.
విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన పాతాళభైరవి చిత్రానికి అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత దుక్కిపాటి మధుసూదనరావు సంస్థ అన్నపూర్ణలో సౌండ్ ఇంజనీర్‌గా చేరారు. చిన్నతనం నుంచి విశ్వనాథ్‌కి సినిమాల పట్ల మంచి అవగాహన ఉంది. ఆ విషయాన్ని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గమనించి 1956లో తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్చుకున్నారు.తోడికోడళ్లు, మూగమనసులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి వంటి సినిమాలకు ఆయన దగ్గర అసోసియేట్‌గా పనిచేశారు విశ్వనాథ్. ఆ సినిమాలు చేస్తున్న సమయంలో అక్కినేని నాగేశ్వరరావు దృష్టిలో పడ్డారు. మంచి కథ ఉంటే సినిమా చేస్తానని విశ్వనాథ్‌కు మాటిచ్చారు అక్కినేని. అలా ఆత్మగౌరవం చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.
దాన్ని సద్వినియోగం చేసుకున్న విశ్వనాథ్ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సాధించారు. ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. ఆత్మగౌరవం చిత్రం తర్వాత విశ్వనాథ్‌కు దర్శకుడుగా మంచి అవకాశాలు వచ్చాయి. ప్రైవేట్ మాస్టారు, కలిసొచ్చిన అదృష్టం, ఉండమ్మా బొట్టు పెడతా, నిండు హృదయాలు, చెల్లెలి కాపురం, చిన్ననాటి స్నేహితులు, నిండు దంపతులు, కాలం మారింది, నేరము శిక్ష, శారద, అమ్మ మనసు వంటి సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించారు విశ్వనాథ్.1974లో ఓ సీత కథ చిత్రంతో వేటూరి సుందరరామ్మూర్తిని గేయరచయితగా పరిచయం చేశారు. ఆ తర్వాత చిన్ననాటి కలలు, జీవనజ్యోతి, మాంగల్యానికి మరోముడి వంటి సినిమాలను రూపొందించారు. దాదాపు పది సంవత్సరాలపాటు 16 చిత్రాలను డైరెక్ట్ చేశారు విశ్వనాథ్. ఆ సమయంలోనే ఆయన ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది.
అందరూ చేస్తున్న తరహాలోనే తను కూడా సినిమాలు చేస్తున్నాననే ఆలోచన ఆయనకు వచ్చింది. ఇకపై తను చేసే సినిమాలు విభిన్నంగా ఉండాలనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే సిరిసిరిమువ్వ. 1976లో విడుదలైన సిరిసిరిమువ్వ చిత్రం ఘనవిజయం సాధించింది.కొత్త తరహా చిత్రాలు రూపొందించాలన్న విశ్వనాథ్ ఆలోచనకు ఆ సినిమా ఊపిరి పోసింది. ఇకపై అలాంటి సినిమాలే చెయ్యాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే కమిట్ అయి ఉన్న కొన్ని సినిమాలను పూర్తి చేసిన తర్వాత సీతామాలక్ష్మీ పేరుతో విభిన్నమైన సినిమాను రూపొందించారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది.
ఆ క్రమంలోనే సిరిసిరిమువ్వ చిత్రాన్ని హిందీలో సర్గమ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా హిందీలో కూడా సూపర్‌హిట్ అయింది. ఈ సినిమా తర్వాత తెలుగు చలన చిత్ర చరిత్రలో ఓ గొప్ప సంచలనం సృష్టించిన చిత్రానికి శ్రీకారం చుట్టారు కె.విశ్వనాథ్. అప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఒక విభిన్నమైన కథ ఆయన మనసులో మెదిలింది.దాన్ని పేపర్‌పై పెట్టి ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు. అదే శంకరాభరణం. శంకరాభరణం చిత్రంలోని శంకరశాస్త్రి పాత్రను అక్కినేని నాగేశ్వరరావు చేస్తే బాగుంటుందని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు భావించారు. కానీ, విశ్వనాథ్ మాత్రం ఆ పాత్రకు శివాజీ గణేశన్ అయితే సరిపోతారు అనుకున్నారు.
కానీ, కొన్ని కారణాల వల్ల ఆయన్ని అప్రోచ్ అవ్వలేకపోయారు. ఆ తర్వాత కృష్ణంరాజును కూడా అనుకున్నారు. అయితే ఒక స్టార్ హీరో శంకరశాస్త్రి పాత్ర చేస్తే తను అనుకున్న ఎఫెక్ట్ రాదని భావించిన విశ్వనాథ్ ఫైనల్‌గా రంగస్థల నటుడు జె.వి.సోమయాజులుని ఫైనల్ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ను 60 రోజుల్లో పూర్తి చేశారు.రాజమండ్రి, అన్నవరం, రామచంద్రాపురం, తమిళనాడు, కర్ణాటకలలో ఈ చిత్రం చేశారు. ఎన్నో అవరోధాల తర్వాత శంకరాభరణం 1980 ఫిబ్రవరి 2న విడుదలైంది. స్టార్స్ లేకుండా కేవలం కథను మాత్రమే నమ్ముకొని తీసిన ఈ సినిమాకి మొదటి వారం ఎలాంటి స్పందన లేదు. రెండో వారం నుంచి మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో రోజురోజుకీ కలెక్షన్లు పుంజుకొని సిల్వర్ జూబ్లీ చిత్రం అయింది.
అలా ఒక్కసారిగా శంకరాభరణం చిత్రంతో కె.విశ్వనాథ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ సినిమాను తమిళ్‌లో, కన్నడలో డబ్ చేశారు. అక్కడ కూడా పెద్ద విజయం సాధించింది. శంకరాభరణం తర్వాత విశ్వనాథ్ పూర్తిగా క్లాసికల్ చిత్రాలకు పరిమితమైపోయారు.ఆ తర్వాత సప్తపది, శుభలేఖ, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, స్వాతికిరణం, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి క్లాసికల్ మూవీస్‌ను డైరెక్ట్ చేశారు. కె.విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన చివరి చిత్రం 2010లో వచ్చిన శుభప్రదం. ఈ సినిమాలన్నీ ఆయన కెరీర్‌లో గొప్ప చిత్రాలుగా నిలిచిపోయాయి. ఒక్కో చిత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.
సంస్కృతి, సంప్రదాయాలను తెలియజెప్పడమే కాదు, సమాజంలో పాతుకుపోయిన కొన్ని మూఢాచారాలను, దురాచారాలను రూపుమాపే కథాంశాలు కూడా ఈ సినిమాల్లో ఉన్నాయి. 1965 నుంచీ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నప్పటికీ శంకరాభరణం చిత్రంతోనే విశ్వనాథ్‌కు ఒక ప్రత్యేకమైన ఖ్యాతి లభించింది. తెలుగులో సూపర్‌హిట్ అయిన సిరిసిరిమువ్వ, జీవనజ్యోతి, శంకరాభరణం, సప్తపది, శుభోదయం, శుభలేఖ, స్వాతిముత్యం చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. ఇవికాక డైరెక్ట్‌గా హిందీలో సంగీత్, ఔరత్ ఔరత్ ఔరత్, ధన్‌వాన్ చిత్రాలను రూపొందించారు విశ్వనాథ్.దర్శకుడిగానే కాదు, నటుడిగా కూడా ప్రేక్షకులపై తనదైన ముద్రవేశారు. 1995లో విశ్వనాథ్ దర్శకత్వంలోనే రూపొందిన శుభసంకల్పం చిత్రంతో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో 30 సినిమాల్లో నటించారు. ఇక కళాతపస్వి కె.విశ్వనాథ్ అందుకున్న అవార్డులు అనేకం.
కేంద్రప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 2016లో అందుకున్నారు. 1992లో పద్మశ్రీ అవార్డు, అదే సంవత్సరం రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు తను రూపొందించిన చిత్రాలకు 6 జాతీయ అవార్డులు, నంది అవార్డులు అందుకున్నారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు దివంగత ఎం.ఎస్.సుబ్బులక్ష్మీ జీవితకథను విదూషమణి పేరుతో సినిమా తియ్యాలని అనుకున్నారు విశ్వనాథ్. అయితే అది నెరవేరలేదు. తనకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిన శంకరాభరణం విడుదలైన ఫిబ్రవరి 2నే కళా తపస్వి కె.విశ్వనాథ్ శివైక్యం చెందడం చూస్తే ఆ సినిమాతో ఆయనకు ఉన్న అనుబంధం ఏమిటో తెలుస్తుంది.