తమిళ స్టార్ హీరో ధనుష్ , సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ జంట విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వీరి దరఖాస్తుపై చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు వీరిద్దరూ తొలిసారి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు తెలియజేశారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని.. విడిపోవాలనే నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
ఆ రోజున తీర్పు వెలువరించనుంది.ధనుష్-ఐశ్వర్య జంట తాము విడిపోతున్నట్లు 2022 జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు.