శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక శుభవార్త చెప్పారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ జిల్లాలలో సీఎం చంద్రబాబు పర్యటన దిగ్విజయంగా ముగిసింది అని పేర్కొన్న ఆయన ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి అన్నీ శుభవార్తలే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసి వలసలు పూర్తిగా అరికడతామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని ఆయన తెలిపారు. 2025 నాటికి వంశధార ఫేజ్ టు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి… పారిశ్రామిక రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు రెండవ దశ పనులు రానున్న జూన్ 2025 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. గత ఐదేళ్లు వైసిపి పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శలు గుప్పించారు. అరసవల్లి ఆలయంలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన వల్ల ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అనేక ప్రాజెక్టులకు మోక్షం లభించిందన్నారు. వంశధార నాగావళి నదుల అనుసంధానం త్వరలో పూర్తి చేస్తామన్నారు. వంశధార ప్రాజెక్టు పరిధిలో హిరమండలము వద్ద నిర్మించిన రిజర్వాయర్ నుంచి 19టీఎంసీ ల నీరు వినియోగించుకొని రెండు పంటలకు నీరు ఇవ్వటం తో పాటు జిల్లా ప్రజలకు సాగునీరు.. త్రాగునీరు సక్రమంగా అందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. పలాస నియోజక వర్గం ఇచ్చాపురం నియోజక వర్గం పూర్తిగా సాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసే మహోన్నత ప్రాజెక్టు పదివేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామని…20 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు మూలపేట పోర్ట్ ను ఆనుకొని వస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తామని అన్నారు… సుమారు 20 వేల మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు.. శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామి జిల్లాగా తయారు చేయటం తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు..