వేలంలో తన పేరు నమోదు చేసుకుని వార్తల్లోకి ఎక్కాడు. స్టార్లుగా ఉన్న ఆటగాళ్లే తమను తీసుకుంటారో లేదోననే అనుమానంతో కొట్టుమిట్టాడుతుంటారు. మనకెందుకులే అని అనుకొని వేలానికి దూరంగా ఉండిపోయే వారు ఉన్నారు. ఐపీఎల్ మేనేజ్‌మెంట్ వేలం షార్ట్‌లిస్ట్‌ను బయట పెట్టగా, అందులో వైభవ్ రూ.30 లక్షల బేస్ ప్రైస్ తో తన పేరును ఎంట్రీ చేయించాడు. వైభవ్‌ను ఏ ఫ్రాంచైజీ తీసుకున్నా అది సంచలనమే అవుతుంది. దాదాపు 35 ఏళ్ల క్రితం సచిన్ 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ స్థాయిలో సంచలనం నమోదు కాలేదు. తాజాగా ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్‌ను ఫ్రాంచైజీ దక్కించుకుంటే క్రికెట్ చరిత్రలో రికార్డే అవుతుంది.
30 లక్షల బేస్ ఫ్రైస్‌తో వైభవ్ తన పేరును ఎంట్రీ చేయించడంతో ఇతను ఎవరు..? ఎక్కడి నుండి వచ్చాడనే చర్చ జరుగుతోంది. వైభవ్ సూర్యవంశీ బీహార్‌లోని తాజ్ పుర్ గ్రామంలో 2011లో జన్మించాడు. నాలుగేళ్ల వయసులోనే బ్యాట్‌ను పట్టుకోవడంతో అతని ఆసక్తిని గమనించిన తండ్రి సంజీవ్ సూర్యవంశీ కుమారుడి కోసం ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించాడు. 8ఏళ్ల వయసులో సమస్తిపూర్‌లోని క్రికెట్ అకాడమిలో చేర్పించాడు. రెండేళ్ల పాటు శిక్షణ పొందిన వైభవ్ .. అండర్ – 16 జట్టులోకి వచ్చేశాడు. అప్పటికి వైభవ్ వయసు కేవలం పదేళ్లు మాత్రమే కావడం విశేషం. లెఫ్ట్ హ్యాండర్ అయిన వైభవ్ బ్యాటింగ్, బోలింగ్‌లోనూ ప్రతిభ చూపాడు. ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన వైభవ్ ఐదు మ్యాచ్‌లు ఆడాడు. ఓపెనర్ అయిన వైభవ్ దూకుడుగా ఆడుతుంటాడు. ఫీల్డింగ్ సెటప్‌ను ఆసరాగా చేసుకొని బౌండరీలు బాదడం అతని స్పెషాలిటీ.