వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. హైదరాబాద్ రాయదుర్గంలోని ‘మై హోం భుజా’లో ఉన్న ఆయనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా విజయవాడ తరలిస్తున్నట్టు తెలిసింది. అయితే, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారా? లేదంటే మరో కేసులోనా? అన్న విషయంలో స్పష్టత లేదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న దాడి జరిగింది. ఈ కేసులో వంశీ సహా 88 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ కోర్టులో వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ జరగనుంది. అంతలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.