ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణీ ప్రసాద్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ వాహనాన్ని ఓవర్‌టెక్ చేయబోయి ప్రమాదవశాత్తు పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే, ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్లయ్యింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన తీరు గురించి ఆరా తీశారు. ఆమెను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. వాణీ ప్రసాద్ మొన్నటి వరకు తెలంగాణ కేడర్‌లో కొనసాగగా.. కేంద్ర ప్రభుత్వం ఆమెను ఏపీ కేడర్‌కు కేటాయించిన విషయం తెలిసిందే. ఆమె ఏపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పని చేస్తున్నారు.