హీరో నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళ్లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాగచైతన్య–శోభిత జంట సామాన్య భక్తుల లాగే క్యూ లైన్‌లో నిలబడి దర్శనానికి వెళ్లారు. వీడియోలో నాగచైతన్య సంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించగా, శోభిత ఎరుపు రంగు చీరలో, నుదుటిన బొట్టు, చేతులకు గాజులతో అచ్చ తెలుగింటి ఆడపిల్లలా కనిపించారు. ఆమె ధరించిన చీర, పాపిట సింధూరం చూసి నెటిజన్లు “సింప్లిసిటీకి ప్రత్యేక నిర్వచనం శోభిత” అంటూ కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలు అయినా సామాన్య భక్తుల్లాగే దర్శనానికి వెళ్లిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అందుకే ఈ జంటపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో వారిరివురు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. భార్య శోభిత చేయి విడవకుండా హీరో చైతూ నడవడం అందరి దృష్టిని ఆకర్షించింది. దర్శనం అనంతరం నాగచైతన్య, శోభిత ఆలయ నుంచి బయటకు రాగా.. చూడటానికి భక్తులు ఎగబడ్డారు.
వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత శోభితతో డేటింగ్ చేస్తున్నారని పలు వార్తలు రావడం, అనంతరం గతేడాది డిసెంబర్‌లో అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి వేడుక చేసుకోవడం మనం చూశాం. అయితే తాజాగా తిరుమల దర్శనంతో మరోసారి ఈ జంట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. సినిమాల విషయానికి వస్తే ‘తండేల్’ సినిమాతో హిట్ కొట్టిన నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు డైరెక్షన్‌లో NC24 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల లేదా పూజా హెగ్డేను తీసుకునే చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇక శోభిత ప్రస్తుతం తమిళ డైరెక్టర్ పా. రంజిత్ తెరకెక్కిస్తున్న వేట్టవం చిత్రంలో నటిస్తున్నట్టు సమాచారం. అంతేకాక, సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.