▪️ ప్రాజెక్టుపై ఆమోదం తెలిపిన సిఎం చంద్రబాబు
మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో భాగంగా విశాఖపట్నం, విజయవాడలో 23.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయబోతున్నారు. విశాఖలో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ మధ్య మొత్తం 19 కి. మీ. పొడవున. విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.70 కి. మీ. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేలా కొత్త డిజైన్లను ప్రతిపాదించారు. మెట్రో రైల్ ప్రాజెక్టులపై గురువారం సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ఆమోదించారు. ఈ మెట్రో రైల్ ప్రాజెక్టులకు 100% నిధులు కేంద్రం సమకూర్చేలా సంప్రదింపులు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు.
డబుల్ డెక్కర్ మోడల్ అంటే?
కింద రోడ్డు, దానిపై ఫ్లైఓవర్ (పైవంతెన), ఆపైన మెట్రో ట్రాక్ రానుంది. మొత్తంగా 18 మీటర్ల ఎత్తులో కొన్ని చోట్ల మెట్రో రైల్ నడవనుంది. దీని ప్రకారం కింద రోడ్డుకు 10 మీటర్ల ఎత్తులో ఫ్లైఓవర్, దానిపై మరో 8 మీటర్ల ఎత్తులో మెట్రో ట్రాక్ రానుంది. పైవంతెన దాటాక మళ్లీ 10 మీటర్ల ఎత్తులోనే మెట్రో రైలు నడవనుంది. ఈ తరహా మోడళ్లు పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.