కళా తపస్వి దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా రాబోతుంది. ‘విశ్వదర్శనం’ అంటూ రాబోతున్న ఈ సినిమాకు జనార్దన మహర్షి దర్శకత్వం వహిస్తుండగా.. టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ బ్యానర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రోమోతో పాటు స్ట్రీమింగ్ డేట్‌కి సంబంధించి అప్‌డేట్‌ను పంచుకుంది చిత్రయూనిట్. ఈ ప్రోమో చూస్తుంటే కె.విశ్వనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని సినీ ప్రముఖులు పంచుకోబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ‘విశ్వదర్శనం’ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కానీ ఏ ఓటీటీ అనేది ప్రకటించలేదు. కె.విశ్వనాథ్ స్వస్థలం బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. తండ్రి విజయవాహినీ స్టూడియోలో పనిచేయడంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా సినీజీవితాన్ని ప్రారంభించారు. తొలిసారి ఎన్టీఆర్ పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్టిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టారు. తొలి చిత్రానికే ఆయనకు నంది అవార్డు దక్కింది. అనంతరం వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం, రుద్రవీణ లాంటి చిత్రాలు తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయాయి.