సినిమా ప్రమోషన్లంటే కేవలం ఇంటర్వ్యూలు, ఈవెంట్లు మాత్రమే కాదని, సరికొత్త పంథాలో కూడా ప్రచారం చేయవచ్చని నిరూపిస్తున్నారు ‘వార్ 2’ కథానాయకులు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్. ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఒకరిపై ఒకరు విసురుకుంటున్న సరదా సవాళ్లతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో వీరి మధ్య మొదలైన ఈ ‘బిల్ బోర్డుల యుద్ధం’ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..ఈ వినూత్న ప్రచారంలో భాగంగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ‘వార్ 2’ పాత్రకు సంబంధించిన భారీ బిల్ బోర్డును నేరుగా హృతిక్ రోషన్ ఇంటికే పంపించారు. ఆ బిల్ బోర్డుపై “ఘుంగ్రూ టూట్ జాయేంగే పర్ హమ్‌సే యే వార్ జీత్ నహీ పావోగే” (మీ ఘుంగ్రూలు పగిలిపోవచ్చు, కానీ ఈ యుద్ధంలో మమ్మల్ని గెలవలేరు) అని రాసి, హృతిక్‌కు సవాలు విసిరారు.
ఎన్టీఆర్ సవాలుకు హృతిక్ కూడా అంతే సృజనాత్మకంగా, దీటుగా బదులిచ్చారు. ఆయన తన పోస్టర్‌తో ఉన్న మరో బిల్ బోర్డును తారక్ ఇంటికి పంపించారు. ఆస్కార్ పురస్కారం గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటను ప్రస్తావిస్తూ, “మీరు ‘నాటు నాటు’ ఎంత చేసినా, ఈ యుద్ధంలో గెలిచేది మాత్రం నేనే” అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. హృతిక్ పంపిన ఈ గిఫ్ట్‌పై ఎన్టీఆర్ స్పందిస్తూ.. “నైస్ రిటర్న్ గిఫ్ట్, హృతిక్ సర్” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ‘ఘుంగ్రూ’ అనేది ‘వార్’ చిత్రంలో హిట్ సాంగ్ కాగా… ‘నాటు నాటు’ పాట ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ అని తెలిసిందే. దాంతో హీరోలిద్దరూ ఒకరి హిట్ సాంగ్ ను మరొకరు ప్రస్తావిస్తూ ఇలా సందడి చేశారు.ఇద్దరు స్టార్ల మధ్య జరుగుతున్న ఈ స్నేహపూర్వక పోటీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారీ యాక్షన్ హంగులతో తెరకెక్కుతున్న ‘వార్ 2’ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ నెల 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.