HomePoliticalవైసీపీ@15..మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తాం..జ‌గ‌న్

వైసీపీ@15..మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తాం..జ‌గ‌న్

కన్నుమూసి తెరిచేలోగా ఏడాది సమయం గడిచిపోయిందని… మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం వైసీపీకి కొత్తకాదని… గతంలో పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని తెలిపారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజల కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని జగన్ అన్నారు. వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు అవుతోందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్నామని చెప్పారు. వైసీపీ చెప్పిందంటే… తప్పకుండా చేస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. ప్రజల గొంతుకగా వైసీపీ పోరాడుతుందని చెప్పారు.

వసతి దీవెనకు ఏడాదికి రూ. 1,100 కోట్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కు రూ. 2,800 కోట్లు కావాలని… అయితే కూటమి ప్రభుత్వం గత ఏడాది కేవలం రూ. 700 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. పిల్లలకు కేటాయింపులు చేయాల్సింది పోయి వారిని ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయనంత సంక్షేమం, అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం అందించిందని అన్నారు. ఈరోజు నిర్వహిస్తున్న పోరుబాటలో పాల్గొంటున్న యువత, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఇన్నేళ్లుగా వైసీపీతో కలిసి నడుస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read