పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలో చంద్రబాబు భాగస్వామి అయితే… కర్త, కర్మ, క్రియ జగనే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని స్పష్టం చేశారు. ఐదేళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా? ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించే ప్రతిపాదనకు ఒప్పుకున్నది మీరు కాదా? అని నిలదీశారు. నాడు ప్రధానమంత్రికి రాసిన లేఖల్లోనూ 41.15 మీటర్లకు నిధులు విడుదల చేయాలని కోరింది మీరు కాదా? అని ప్రశ్నించారు.
మరోవైపు, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు చెబుతూ, మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 41.15 మీటర్ల ఎత్తు… రూ.30,436 కోట్ల బడ్జెట్ అంచనాలకు కేంద్రం ఆమోద ముద్ర వేస్తే…. 45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు కడతామని అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వం చెబుతున్నవి అవాస్తవాలు కాదా? అని షర్మిల ప్రశ్నించారు. ఎత్తు తగ్గింపు విషయం అవాస్తవం అయితే దానిపై కేంద్రంతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.